–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : గ్రామాలలో తాగునీటి వృధాను అరికట్టి, ప్రయోగాత్మక పద్ధతి ద్వారా సక్రమ నీటి నిర్వహణకు ముందుకు వచ్చిన మద్రాస్ ఐఐటీ బృందానికి జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా శాఖతో పాటు, పంచాయతీరాజ్, ఇతర సంబంధిత శాఖలు ఈ బృందానికి గ్రామాలలో సహాయం అందించాలన్నారు. తాగునీటి ట్యాంకులు నిండి నీరు వృధాగా పోవడం, గేట్ వాల్వుల లీకేజీ, పైపుల లీకేజీ, తదితర కారణాలవల్ల గ్రామాలలో తాగునీరు వృధా అవుతున్న విషయం మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇలాంటి నీటి వృధాను అరికట్టెందుకు గాను మద్రాస్ ఐ ఐ టి బృందం ముందుకు వచ్చింది. ఈ బృందం ముందుగా ప్రయోగాత్మక పద్ధతిలో ఎంపిక చేసిన గ్రామాలలో వాటర్ ట్యాంకు పై ఒక సోలార్ ప్యానల్ ను ఏర్పాటు చేసి దానికి అడాప్టర్ ను అనుసంధానిస్తుంది.
నీటి నిర్వహణ కై ప్రత్యేకంగా రూపొందించిన ఐ ట్యాంక్ యాప్ ద్వారా తాగు నీరు వృధా కాకుండా యాప్ ద్వారానే నిర్వహించుకునే విధంగా రూపొందించడం జరిగింది. దీనివల్ల వాటర్ ట్యాంకుల ద్వారా వృధా అయ్యే నీటిని, అలాగే అక్కడక్కడ గేట్ వాల్వుల లీకేజీలను, పైపులైన్ లీకేజీలను అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాక గ్రామీణ స్థాయిలో తాగునీటి సరఫరా నిర్వహణకు మానవనరులను తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. పైలెట్ పద్ధతిన అమలు చేయనున్న ఈ కార్యక్రమంలో భాగంగా మద్రాస్ ఐఐటి బృందం నల్గొండ జిల్లాలోని 11 మండలాల్లోని కొన్ని గ్రామపంచాయతీలను ఎంపిక చేసి నీటి నిర్వహణ సిష్టాన్ని అమలు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయమై మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మద్రాస్ ఐఐటి బృందం, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, తదితర శాఖల అధికారులు సిబ్బందితో సమావేశమయ్యారు. ప్రస్తుత సమయంలో తాగునీటికి చాలా ప్రాముఖ్యత ఉందని, నీరు వృధా కాకుండా పైలట్ పద్ధతిన ముందుగా ఎంపిక చేసిన గ్రామాలలో నీటి వృధాను అరికట్టేందుకు మద్రాస్ ఐఐటీ బృందం చేస్తున్న కృషికి మద్దతుగా అన్ని శాఖలు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు.ఈ ప్రయోగాత్మక కార్యక్రమం విజయవంతం అయితే అన్ని గ్రామాలలో ఇలాంటి పద్ధతిని అమలు చేసి తాగునీటి వృధాను అరికట్టవచ్చు.
స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, డిపిఓ వెంకయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. శాంతకుమారి, మద్రాస్ ఐఐటీ బృందం ప్రతినిధి సాయి, బృందం సభ్యులు, తదితరులు హాజరయ్యారు.