–బిజెపి పై పొలిటికల్ ఫైట్ జరగాలి
–ప్రభుత్వ వైఫల్యమే ఎస్ ఎల్ బి సి ప్రమాదానికి కారణం
–విలేకరుల సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని
Tammineni Veerabhadram :ప్రజాదీవేన , నల్లగొండ : రాష్ట్రానికి ప్రమాదకరంగా మారబోతున్న బిజెపి విధానాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు విఫలం చెందాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సిపిఎం కార్యాలయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాయ మాటలతో, మతోన్మాదంతో ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలుపొందాలని బిజెపి చూస్తుందని అందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిదర్శనం అన్నారు.
బిజెపికి తామే ప్రధాన శత్రువు అని, తమ పార్టీ మాత్రమే అడ్డుకుంటుందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రాష్ట్రంలో బిజెపిని అడ్డుకోలేకపోతుందని విమర్శించారు. కేవలం బిఆర్ఎస్ పార్టీని విమర్శించడమే తప్ప బిజెపి విధానాలను ఎండగట్టడం లేదని ధ్వజమెత్తారు. అలాగే బిఆర్ఎస్ పార్టీ కూడా అదేవిధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. బిజెపికి బిఆర్ఎస్ సహకరిస్తుందని కాంగ్రెస్ చెప్పడం, కాంగ్రెస్ బిజెపి పార్టీలు రెండు ఒకటేనని బిఆర్ఎస్ చెప్పడం తో ఒకరికొకరు విమర్శ చేసుకుంటున్నారే తప్పా బిజెపిని సైదాంతిక, రాజకీయపరంగా విమర్శించడం లేదని ఎద్దవ చేశారు. ఇదే విధంగా కొనసాగితే తెలంగాణకు బిజెపి ప్రమాదం పొంచి ఉంటుందని ప్రధాన రాజకీయ పార్టీలు బిజెపిని అడ్డుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. భవిష్యత్తులో బిజెపి పై పొలిటికల్ ఫైట్ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
బిజెపి ప్రమాదంపై తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలోకి తీసుకెళ్తామన్నారు. రాజస్థాన్ లో ఓ చిన్న కేసు విషయంలో పోలీసులు అర్ధరాత్రి ఇంట్లో చొరబడి ఆరు నెలల చిన్నారి చావుకు కారణం అయ్యారని, ముస్లిం వ్యతిరేకంగా పాలన చేయడమే ఆ పార్టీ లక్ష్యమన్నారు. మోడీ ప్రభుత్వం ఫాసిస్టు లక్షణాలు కలిగి ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు కేవలం బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ పైనే ఏదో గొప్పలు చేసినట్టు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. 50 శాతం రిజర్వేషన్లు దాటవద్దని సుప్రీంకోర్టు చెప్తున్నా ఆ విషయం దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్లో బీసీ కులగణన ఆమోదం పొందదనే దృష్టితోనే బీసీ కులగణన చేసినట్లు చెప్పుకుంటున్నారన్నారు.
ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ నాటకం మని విమర్శించారు.ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన దురదృష్టకరమన్నారు.
ప్రభుత్వ వైఫల్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నామన్నారు. సొరంగ మార్గం తొవ్వేటప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని విమర్శించారు. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వ తీరు ఉన్నదన్నారు.బీఆరెస్ ప్రభుత్వ హయంలో సొరంగ పనులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కూడా ఒరగబెట్టింది ఏమి లేదన్నారు.
ప్రధాన పార్టీలు పరస్పర విమర్శలు మాని ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీపీఎం ఖమ్మం, నల్గొండ జిల్లా కార్యదర్శులు నూనె నాగేశ్వర్ రావు, తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం.వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు రవి నాయక్, ఎండి. సలీం, నాయకులు డా. మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు, కోడి రెక్క మల్లయ్య, అరుణ, పల్లా బిక్షం తదితరులు పాల్గొన్నారు.