–తెలంగాణ యునివర్సిటీ క్యాంటీన్ ఆహారాల్లో క్రిమికీటకాలు
–మొన్న బల్లి, నేడు పురుగులు యథాలాపంగా వస్తున్న వైనం
–హాస్టళ్లలో ఇలా ఎలా తినేదoటూ లబోదిబోమంటున్న విద్యార్ధులు
Telangana University:ప్రజాదవెన, నిజామాబాద్: చట్నీలో ఎలుక.. పెరుగు తాగుతూ పిల్లి.. ఈ సీన్లు జేఎన్టీయూ కాలేజీ (JNTU College) క్యాంటీన్లలో కనిపించాయి.. అయితే.. తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) మొన్న అల్పాహారంలో బల్లి.. శుక్రవారం భోజనంలో పురుగు.. కనిపించాయి.. దీంతో ఇక హాస్టళ్లలో తాము తినేదెట్ల అంటూ విద్యార్థులు లబోదిబోమంటున్నారు. నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University)ఇటీవల అల్పాహారంలో బల్లి కనిపించగా.. తాజాగా.. భోజనంలో పురుగు కనిపించడం కలకలం రేపింది.. యూనివర్సిటీ విద్యార్థులకు అందించే భోజనంలో పురుగు కనిపించడం ఆహార నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హాస్టల్ మెస్‌లో ఓ విద్యార్థిని భోజనం చేస్తుండగా సాంబార్‌లో పురుగు కనిపించింది. భోజనంలో తరచూ కీటకాలు వస్తున్నాయని.. ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతంలో కూడా అల్పాహారంలో బల్లి రాగా కుక్‌పై చర్యలు తీసుకున్నారని.. ఐనా సిబ్బందిలో మార్చు రావడం లేదని మండిపడ్డారు. వర్సిటీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులు.
జేఎన్టీయూ హాస్టల్‌లో చట్నీలో ఎలుక..
ఇటీవల సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ హాస్టల్‌లో (Sultanpur JNTU Hostel) చట్నీలో ఎలుక పడింది. ఆ తర్వాత జేఎన్టీయూ యూనివర్సిటీ క్యాంపస్ హాస్టల్‌లో విద్యార్థులకు వడ్డించే భోజనంపై మూత పెట్టకపోవడంతో.. ఓ పిల్లి పెరుగు తాగుతూ కనిపించింది.. ఇది గమనించిన విద్యార్థులు వీడియో తీసి వర్సిటీ హాస్టళ్ల దుస్థితిని బయట ప్రపంచానికి చూపించారు. ఈ ఘటనతో వర్సిటీ హాస్టళ్లలో శుచీశుభ్రత విషయం చర్చనీయాంశంగా మారింది.