TGSRTC : ప్రజాదీవెన, నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో రెండేండ్లకు ఒకసారి జరిపే రెండవ అతిపెద్ద జాతరైన దురాజుపల్లి శ్రీ లింగమంతుల పెద్దగట్టు జాతర ఫిబ్రవరి 16వ తేది తెల్లవారుజామున ప్రారంభమై 20/02/2025 వరకు జరగనున్నాయి. ఈ లింగమంతుల జాతర(పెద్దగట్టు)కు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తుల ప్రయాణ సౌకర్యార్ధం ఈ జాతరకు సూర్యాపేట డిపో నుండి 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ కె.జానిరెడ్డి శుక్రవారము ఒక ప్రకటనలో తెలిపారు.
రెండేండ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు టి.జి.ఎస్.ఆర్.టి.సి. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి భక్తులను సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు. భక్తుల రద్దీని బట్టి బస్సులు పెంచే అవకాశం ఉందని తెలిపారు.ఇట్టి అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీజీఎస్ఆర్టిసి బస్ లలో ప్రయాణం చేయండి మీ ప్రయాణాన్ని సుఖమయం చేసుకోండి అన్నారు.