–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే బాల నాయక్
Grain Unloading :ప్రజాదీవెన నల్గొండ : దేవరకొండ పరిధిలోని రైస్ మిల్లర్లు మిల్లుల వద్ద రబీ ధాన్యం దించుకొనే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ కోరారు. మంగళవారం దేవరకొండ ఆర్డిఓ కార్యాలయంలో రబీ ధాన్యం పై రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో శాసనసభ్యులు బాలునాయక్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు సకాలంలో ధాన్యాన్ని దించుకోనట్లయితే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని, అందువల్ల నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ధాన్యాన్ని మిల్లుల వద్ద దించుకోవాలని కోరారు.15 రోజుల నుండి కొనుగోలు కేంద్రాల వద్ద నుండి పెద్ద ఎత్తున ధాన్యం మిల్లులకు పంపుతున్నారని, రోజు వారి నిర్దేశించిన టార్గెట్ ప్రకారం దించుకోవాలని తెలిపారు. ప్రతి మిల్లరు రోజు కనీసం 15 లారీలైన దించుకోవాలన్నారు. ఈ విషయాన్ని తహసిల్దార్ తో పాటు, ఆర్ఐ అందరూ పర్యవేక్షించాలని ఏ మిల్లరైనా ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్ కు సూచించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా మిల్లర్లు ప్రతిరోజు వారికి నిర్దేశించడం ప్రకారం ధాన్యాన్ని దించుకోవాలన్నారు. మిల్లర్లకు రెండు రోజుల సమయం ఇచ్చి వేచి చూస్తామని తెలిపారు. 15 రోజుల్లో దేవరకొండ ప్రాంతంలో మొత్తం ధాన్యం కొనుగోలును పూర్తిచేయాలని ఆమె చెప్పారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరు సహకరించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అలాకాకుండా రైస్ మిల్లర్లు ధాన్యం దించుకోకుండా ఇబ్బందులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు బాలు నాయాక్ తో కలిసి కొండ మల్లెపల్లి మండలం చిన్న ఆడి శేర్లపల్లి లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ వాహనాల సమస్య ఉందని తెలుసుకొని ప్రతిరోజు 6 లారీలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని తరలించాలని, అవసరమైతే తహసిల్దారు స్థానికంగా వాహనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం గుండ్లపల్లి (డిండి) మండలం చెరుకుపల్లి,కామేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయగా అక్కడ రెండు లారీలు ధాన్యాన్ని తీసుకెళుతున్నాయని తెలుసుకొని ఇదేవిధంగా ధాన్యాన్ని తరలించే ప్రక్రియను కొనసాగించాలని చెప్పారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరిష్, జిల్లా పరిసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు వెంకన్న, జైపాల్ తదితరులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.