Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tireless Crusader :ప్రజా సమస్యలపై నిరంతరం కృషి చేసిన త్యాగదనుడు

–సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం

— తుమ్మల వీరరెడ్డి

Tireless Crusader :ప్రజాదీవెన నల్గొండ :  దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషిచేసిన త్యాగదనుడని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. సోమవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య 40 వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం తెలంగాణ ప్రాంతంలో జరిగిన సాయుధ రైతాంగ సాయుధ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య అగ్ర భాగాన ఉండి సాయుధ పోరాటాన్ని నడిపారని అన్నారు. వందలాది ఎకరాలు కలిగిన భూస్వామ్య కుటుంబంలో పుట్టిన సుందరయ్య ప్రజల కోసం తనకు వారసత్వంగా వచ్చిన వందలాది ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి ఇచ్చి, జీవితాంతం నిరాడంబర జీవితాన్ని గడిపారని కొనియాడారు.1934 వ సంవత్సరంలో తన సొంత గ్రామం నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకా అలగానిపాడు లో వ్యవసాయ కార్మిక సంఘం స్థాపించి, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాన్ని నడిపిన మహా యోధుడు సుందరయ్య అని అన్నారు.పార్లమెంటుకు, శాసనసభకు సైకిల్ పై వెళ్లే వారన్నారు.

సమాజమే నా పిల్లలు అనుకుని తాను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారని ఆయన సేవలను గుర్తు చేశారు. చట్టసభలకు వన్నె తెచ్చిన మహానేత సుందరయ్య అని, ఆయన పార్లమెంటు, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తూ, ఆదర్శ నేతగా ఉంటూ, ప్రతిపక్ష, అధికార పక్ష నేతల మన్ననలు పొందారని అన్నారు. నాడు కూడా దేశ సరిహద్దులు సమస్య వచ్చినప్పుడు పార్లమెంటులో సుందరయ్య చేసిన ఉపన్యాసం పలువురిని ఆకట్టుకుందని, సమస్య పరిష్కారానికి దారి చూపారని గుర్తు చేశారు. దేశం లో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులను కూడా పార్లమెంటులో తన వాగ్దాటి ద్వారా పరిష్కరించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేశారని చెప్పారు. కానీ ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూరును పార్లమెంటు సమావేశం పెట్టి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రజలకు వివరించడం లేదని ప్రశ్నించారు.
నేడు ఎంతోమంది రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేస్తున్నారని, విలువలను మరిచి అక్రమ సంపాదనకు, పదవి వ్యామోహంతో డబ్బు కోసం పార్టీలు మార్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. నేటి యువత సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సిహెచ్. లక్ష్మీనారాయణ, ఎండి సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, నలపరాజు సైదులు,
ఆకారపు నరేష్, పోలే సత్యనారాయణ, బి. పరిపూర్ణ చారి, భూతం అరుణకుమారి, రవీ, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.