–తొలివిడత 13 నుండి 17 వరకు కొనసాగింపు
–రెండవ విడత 20 నుంచి 24 వరకు
–మూడో విడత శిక్షణ 27 నుండి ఈ నెల 31 వరకు కొనసాగింపు
–ఆరు పాఠశాలలలో శిక్షణ తరగతులకు ఏర్పాట్లు
–నేడు శిక్షణా తరగతుల ఇన్చార్జులు, జిల్లా రిసోర్స్ పర్సన్ల తో సంసిద్ధత శసమావేశం
–వివరాలు వెల్లడించిన డీఈవో బిక్షపతి
Teacher Training Sessions : ప్రజాదీవెన , నల్గొండ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దిగజారినట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచడానికి ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించాలనే లక్ష్యంతో సర్కారు ముందుకెళ్తుంది. శిక్షణ కార్యక్రమాలు చాలా అవసరంగా భావించి ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే నల్లగొండ జిల్లాలో కూడా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు మూడు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి అందుకు కావలసిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడత శిక్షణా కార్యక్రమం ఈనెల 13 నుండి 17 వరకు, రెండవ విడత శిక్షణ కార్యక్రమం 20 నుండి 24 వరకు, మూడో విడత శిక్షణ కార్యక్రమం ఈనెల 27 నుండి 31 వరకు కొనసాగనుంది. అందులో భాగంగానే నేడు శిక్షణా తరగతుల ఇన్చార్జులు, జిల్లా రిసోర్స్ పర్సన్ లతో సంసిద్ధత శసమావేశని ఏర్పాటు చేశారు. శిక్షణలను సమర్థవంతంగా నిర్వహించుటకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు పై సమావేశంలో చర్చించనున్నారు.
—శిక్షణ ఇచ్చేది ఇక్కడే..
నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో గల సెయింట్ ఆల్ఫోన్సస్ హై స్కూల్, మిర్యాలగూడ రోడ్ లో గల ప్రభుత్వ డైట్ కళాశాల, ఆర్పి రోడ్ లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, మిర్యాలగూడ రోడ్డులోని నల్లగొండ ప్రభుత్వ ఉపాధ్యాయ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల డైట్ నందు ఈ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.
—మొదటి విడతలో…
జిల్లాస్థాయిలో ఉపాధ్యాయుల మొదటి విడత శిక్షణకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, గణితం, సోషల్ సబ్జెక్టు ఉపాధ్యాయులు, మండల స్థాయి రిసోర్స్ పర్సన్లు, జిల్లాలోని ఉర్దూ మీడియం ప్రైమరీ టీచర్లు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు,ఐఇ ఆర్పీలు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ శిక్షణలకు కోర్సు డైరెక్టర్ గా జిల్లా విద్యాశాఖాధికారి, కోర్సు కోఆర్డినేటర్లుగా ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్, క్వాలిటీ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష విద్యాశాఖ వ్యవహరిస్తారు.
ఈ శిక్షణలో ప్రభుత్వ, లోకల్ బాడీ (ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, యుఆర్ఎస్, తెలంగాణ మోడల్ స్కూల్) లలో పనిచేయుచున్న ఉపాధ్యాయులు అనగా జిహెచ్ఎం, ప్రిన్సిపల్, ప్రత్యేక అధికారి, స్కూల్ అసిస్టెంట్, ఎల్ పి టి, హెచ్ పి టి, పిఈటి, టిజిటి, సిఆర్టి లు పాల్గొనాలి.
— శిక్షణ తరగతులలో బోధించేవి ఇవే…
ఐదు రోజులపాటు నిర్వహించనున్న ఈ తరగతిలో పలు అంశాలు బోధించనున్నారు.
ఇందులో కంటెంట్ఎన్రిచ్మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ స్కిల్స్, లెర్నింగ్ అవుట్ కమ్స్ తదితర విషయాలు ఉన్నాయి.
— ఎవరికి మినహాయింపు లేదు…
ఈ శిక్షణలకు ఉపాధ్యాయులందరూ వారికి కేటాయించిన తేదీలలో తప్పక హాజరు కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయులందరూ ప్రతిరోజు ఉదయం 9.30 గంటల లోపు ట్రైనింగ్ సెంటర్ కు చేరుకొని కేంద్రంలోని సెంటర్ ఇన్చార్జికు రిపోర్ట్ చేయాలని, ఇందులో ఎవరికి మినహాయింపు లేదని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి స్పష్టం చేశారు. అదే విధంగా పాఠశాలల్లో బడిబాట కార్యక్రమాన్ని కొనసాగించాలని, రాబోయే విద్యా సంవత్సరానికి ఎన్రోల్మెంట్ పెంచుటకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమ్మర్ క్యాంపులను మండల విద్యాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. 10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రతి ఒక్కరు ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఏఐఏఎక్స్ఎల్ ల్యాబ్ లను వేసవిలో విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు.