–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: మాతా శిశుమరణాలను తగ్గించడాన్ని సవాల్ గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆశ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు.
సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించి అన్ని రంగాలలో మనిషి ముందుకెళుతున్నప్పటికీ అవగాహన లోపం, మూఢనమ్మకాల కారణంగా ఇంకా అక్కడక్కడ గ్రామీణ ప్రాంతాలలో ప్రసవం సందర్భంగా,ప్రసవానంతరం మాతా, శిశు మరణాలు సంభవించడం బాధాకరమని అన్నారు. ఇకపై జిల్లాలో ఎలాంటి మాతా శిశు మరణాలు సంభవించకుండా చూడాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని ప్రభుత్వ వైద్యులు, ఆశా కార్యకర్తలు సవాలుగా తీసుకోవాలని చెప్పారు. ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ,గ్రామాల పరిధిలో ఒక్క మాతా శిశు మరణం సంభవించకూడదన్న లక్ష్యం తో పనిచేస్తే మాత శిశు మరణాలు తగ్గిపోతాయన్నారు.
గత రెండు నెలలతో పోలిస్తే జిల్లాలో మాత, శిశు మరణాల సంఖ్య తగ్గిందని, ఇందుకు గాను ఆమె వైద్య అధికారులు, ఆశ కార్యకర్తలను అభినందిస్తూ …మాత శిశు మరణాలు లేని జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చి దిద్దాలని ఆమె కోరారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా అన్ని ఏరియా ఆస్పత్రులు ,ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు,సబ్ సెంటర్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు గ్రామీణ ప్రాంత మహిళలు, ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
పౌష్టికాహారం తీసుకోవడం, సరైన సమయానికి వైద్య పరీక్షలు చేయించుకుని పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టే విధంగా చూడడంతో పాటు, గర్భిణి స్త్రీ సైతం ఆరోగ్యంగా ఉండేలా అవగాహన కల్పించాలని అన్నారు. గర్భం దాల్చిన తర్వాత గ్రామాలలోని ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వారికి అరోగ్య సంరక్షణ పై అవగాహన కల్పించాలని, అవసరమైతే వైద్యాధికారులు గర్భిణీ స్త్రీలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు.ప్రసవం కష్టం అయ్యే కేసులు, కవల పిల్లలు ,హై రిస్క్ కేసులను మాత్రమే జి జి హెచ్,ఏరియా ఆసుపత్రులకు పంపించాలని ఆమె తెలిపారు .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల వారిగా సమీక్ష నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ డాక్టర్ మాతృనాయక్, డాక్టర్లు స్వరూప రాణి, వందన, డిప్యూటీ డిఎంహెచ్వోలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, ఆశ కార్యకర్తలు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.