— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
ప్రజా దీవెన, చందంపేట: ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై గ్రామాలలో ప్రజలకు మరోసారి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పునరుద్ఘాటించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే లో భాగంగా మంగళవారం ఆమె నల్గొండ జిల్లా దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చందం పెట్ మండలంలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను తనిఖీ చేశారు. ముందుగా జిల్లా కలెక్టర్ చందంపేట మండలం గాగిల్లాపూర్ లో సర్వే నిర్వహిస్తున్న ఇండ్లకు వెళ్లి సర్వేపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా చందం పెట్ మండలంలో నెట్ వర్క్ సమస్య వల్ల సర్వే ఆలస్యం అవుతున్నదని సర్వే బృందాలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఒక్క ఇంటిని సర్వే చేసేందుకు ఎంత టైం పడుతుందని జిల్లా కలెక్టర్ అడిగగా నెట్ వర్క్ బాగుంటే 8 నిమిశాలు పడుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజలతో మాట్లాడుతూ సర్వేపై అవగాహన ఉందా? దేనికోసం సర్వే చేస్తున్నారో తర్వాత తెలుసా? అని అడిగారు. గ్రామంలో 621 అప్లికేషన్ల కు గాను ఇప్పటివరకు 138 దరఖాస్తులు సర్వే చేసినట్లు పంచాయతీ కార్యదర్శి శేఖర్ జిల్లా కలెక్టర్ కు వివరించారు .చాలామంది గ్రామాలలో లేకపోవడం ,నెట్ వర్క్ సమస్యల వల్ల సర్వే ఆలస్యం అవుతుంది అని తెలుపగా, మరోసారి ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై అవగాహన కల్పించాలని,గ్రామాలలో ముందే టామ్ టామ్ చేయాలని చెప్పారు. ఒకవేళ ఎవ్వరైనా ప్రజాపాలన లో దరఖాస్తు ఇచ్చి ఉన్నప్పటికీ అప్లోడ్ కాకుంటే మరోసారి ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న ప్రజా పాలన మీ -సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించాలని, అలా దరఖాస్తు చేసుకున్న కొత్త వారందరికీ ఒక నిర్ధారిత తేదీని ఇచ్చి వారి దరఖాస్తులను సైతం పరిశీలించడం జరుగుతుందని అన్నారు.
ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం మాత్రమే దరఖాస్తులు తీసుకోలేదని, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డులు, అలాగే ఉచిత విద్యుత్ వంటి వాటికీ కూడా దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె బుయ్యా పుల్లమ్మ అనే దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి ఇంటిని పరిశీలించడమే కాకుండా, ఆమెతో ముఖాముఖి మాట్లాడారు.సర్వే ఎందుకు చేస్తున్నారో తెలుసా ? అని బుయ్య పుల్లమని అడగగా ఇండ్ల కోసం అని బదులు ఇచ్చారు. నీకు ఇల్లు ఇస్తే ఎక్కడ కట్టుకుంటావని ప్రశ్నించగా? స్థలం ఉందని కొత్త స్థలంలో ఇల్లు నిర్మించుకుంటానని పుల్లమ్మ బదులిచ్చారు.
అనంతరం జిల్లా కలెక్టర్ హాంఖ్య తండా లో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను తనిఖీ చేశారు. ఇప్పటివరకు గ్రామంలో (83) దరఖాస్తులు సర్వే చేశామని ,మంగళవారం ఉదయం నుండి 8 ఇండ్లు చేసామని, సర్వర్ సమస్య వల్ల ఉదయం నుండి కేవలం ఎనిమిది మాత్రమే చేసినట్లు పంచాయతీ కార్యదర్శి జిల్లా కలెక్టర్ కు వివరించారు. కేతావత్ పార్వతి నారాయణ దరఖాస్తు దారు ఇంటికి వెళ్లి అక్కడ ఆమెకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ సమక్షంలో అప్లికేషన్ లో అప్లోడ్ చేయించారు. తాండ మొత్తం 291 దరఖాస్తులకు గాను ఇప్పటివరకు 95 పూర్తి చేసినట్లు పంచాయతీ కార్యదర్శి వివరించారు. కొత్త స్థలాలకు సంబంధించి ఎలాంటి దృవపత్రాలు లేని వారి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు .
ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఇదే మండలం మూర్పు నూతల గ్రామంలో సర్వేను తనిఖీ చేయగా ఈ గ్రామంలో 384 దరఖాస్తుల గాను, ఇప్పటివరకు 143 దరఖాస్తులను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కు తెలిపారు. చాలామంది హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లినందున ఆలస్యం అవుతున్నదని, వారందరికీ సమాచారం ఇచ్చామని ఎంపీడీవో లక్ష్మి జిల్లా కలెక్టర్ కు తెలియజే యగా వాట్సాప్ ద్వారా సమాచా రం అందించి అందుకు సంబం ధించిన స్క్రీన్ షాట్ ను తమ దగ్గర ఉంచుకోవాలని, సర్వే గడువు ముగిసిన తర్వాత తిరిగి అలాంటివారికి సర్వే చేయడం జరగదని స్పష్టం చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపా రు.చందం పెట్ మండల ప్రత్యేక అధికారి, జిల్లా మైన్స్ సహాయ సంచారకులు జాకబ్, దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, చందంపేట ఎంపీడీవో లక్ష్మి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.