–ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా సాగర్ ఏరియా ఆసుపత్రిలో సౌకర్యాలు .
— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Tripathi : ప్రజా దీవెన, నాగార్జునసాగర్: సాగర్ ఏరియా ఆసుపత్రిలో ప్రైవేట్ ఆస్పత్రులకు పోటీపడే విధంగా వైద్య సౌకర్యాలు, ఆధునాతన యంత్ర పరికరాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అత్యవసర సేవలు, క్యాజువాలిటీ, సాధారణ ప్రసవాలకు సాగర్ ఏరియా ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మంగళవారం ఆమె సాగర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఓపి, క్యాజువాలిటీ , ఎమర్జెన్సీ, ఎం సి హెచ్ , లేబర్ తదితర వార్డులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఎం. హరి కృష్ణ ,ఆస్పత్రి డాక్టర్లతో మాత, శిశు సంరక్షణ, ప్రసవాలు తదితర అంశాలపై సమీక్షించారు.ఏరియా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నందున ప్రసవాలతో పాటు , మాత, శిశు సంరక్షణకు డాక్టర్లు కృషి చేయాలని అన్నారు. ఎమర్జెన్సీ ,క్యాజువాలిటీ సేవలతో పాటు, సాధారణ ప్రసవాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లకుండా ఏరియా ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు పొందాలని సూచించారు.
సాగర్ ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, ముఖ్యంగా అధునాతన యంత్ర పరికరాలు ఉన్నాయని, ఈ ఆసుపత్రికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని దివంగత ప్రధాని నెహ్రూ హయాంలో శంకుస్థాపన చేసిన ఈ ఆసుపత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. అలాగే ఇక్కడి డాక్టర్లు సైతం ప్రతిభావంతులు ఉన్నారని, మంచి వైద్య సేవలు అందిస్తున్నారని ఆమె అభినందించారు . ఆస్పత్రికి కావాల్సిన ఏ ఎన్ ఎం లు,ఆశ వర్కర్లు ,102 అంబులెన్స్ వాహనం డ్రైవర్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆమె తెలి పారు.అనంతరం జిల్లా కలెక్టర్ పాత ఆస్పత్రి భవనాన్ని పరిశీ లించారు. ఆస్పత్రి ఆర్ఎంవో, గైన కాలజిస్ట్, ఇతర డాక్టర్లు ఉన్నారు.