–మినీ సరస్ ఫెయిర్ 2025 ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
CollectorTripathi drda :ప్రజాదీవెన, నల్గొండ : గ్రామీణ స్వయం సహాయ సంఘాల మహిళలు జాతీయ స్థాయి వ్యాపార వెత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన మద్దతు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం సహాయ మహిళా సంఘాలు తయారు చేసిన చేనేత, హస్త కళల, ఆహార ఉత్పత్తుల ప్రదర్శన ‘మిని సరస్ ఫెయిర్ 2025’ ఆమె ప్రారంభించారు.
అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో తొలిసారి నల్గొండ లో ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా సంఘాల కోసం సరస్ ఏర్పాటు చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల్ని సోషల్ మీడియా, అమెజాన్ లాంటి ఆన్ లైన్ మార్కెట్ లో కూడా మార్కెటింగ్ చేయాలని సూచించారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన అనేక సంస్థలు ఆ తర్వాత నాణ్యత, మార్కెటింగ్ తో పెద్ద కార్పొరేట్ కంపెనీలుగా ఎదిగాయని జిల్లా కలెక్టర్ ఉదాహరణలతో తెలియజేశారు. అందుకోసం అవసరమైన అన్ని రకాల మద్దతు జిల్లా యంత్రాంగం నుంచి ఉంటుందని హామీ ఇచ్చారు.
సాధారణ ప్రజలతోపాటు ప్రభుత్వ సిబ్బంది, అధికారులు కూడా మినీ సరస్ సందర్శించి ఉత్పత్తులు కొనుగోలు చేసి మహిళా సంఘాల ఉత్పత్తులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రదర్శనలో ఉన్న స్టాళ్లను సందర్శించి వివారాలు అడగడంతో పాటు ఉత్పత్తులు కొనుగోలు చేసి మహిళా సంఘాల ప్రతినిధులను ఉత్సాహ పరిచారు.
ఈ కార్యక్రమంలో పేదరిక నిర్మూలన సంస్థ డైరెక్టర్ పి. డబ్ల్యు.జాన్సన్ మాట్లాడుతూ తెలంగాణలో నల్గొండ జిల్లా గ్రామీణ మహిళా సంఘాలు అభివృద్ధిలో ముందు ఉన్నాయని కొనియాడారు. రాష్ట్ర స్థాయిలో మాత్రమే నిర్వహించే సరస్ ప్రదర్శనను తొలిసారి నల్గొండ లో ఏర్పాటు చేయడం పట్ల ఆయన జిల్లా అధికారులను అభినం దించారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ సంచాలకులు జి. కోటేశ్వర రావు, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణ వేణి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.పద్మ , పరిశ్రమల శాఖ జీఎం వి.కోటేశ్వర రావు, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 8 వరకు సరస్ ప్రదర్శన…గ్రామీణ మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన ఈ నెల 8 వ తేదీ(శనివారం) వరకు నల్గొండ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో కొనసాగుతుందని జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి రాత్రి 9.30 వరకు ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు. వందకు పైగా స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి రోజూ సాయంత్రం సందర్శకుల కోసం కళా ప్రదర్శనలు ఉంటాయని వెల్ల డించారు.