— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజాస్వా మ్య వ్యవస్థలో ఓటు హక్కు చాలా విలువైనదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన “జాతీయ ఓటర్ల దినోత్సవం” కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అతి విలువైనదని, 18 సంవత్సరములు నిండిన ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు కావాలని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడే ఎన్నికల్లో నామినేషన్ ప్రారంభం నుండి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రతి దశలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పకడ్బందీగా పనిచేస్తుందని, మన దేశంలో పూర్తి పారదర్శకతతో జరిగే ఎన్నికల ప్రక్రియ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.
మనదేశం మానవ హక్కుల పరిరక్షణలో, అభివృద్ధిలో చైతన్యమై అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచిందని అన్నారు. ఓటు అనేది పౌరుడి హక్కు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తివంతమైన ఆయుధమని, ప్రతి పౌరుడు ప్రాథమిక బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, దేశ భవిష్యత్తులో తాను కూడా భాగస్వామ్యం కావాలని అన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారిచేత ఓటు హక్కు కలిగి ఉంటామని, ఓటు హక్కును వినియోగించుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు . అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, విశ్రాంత ఐఏఎస్ చోల్లేటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.