— సుప్రీం న్యాయవాది వైద్యనాథన్, అధికారులతో మంత్రి ఉత్తమ్ భేటీ
Uttam kumar reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: కృష్ణా జలాల్లో సమాన వాటాను సాధిం చాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam kumar reddy) అధికారులకు స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆదివారం జలసౌధలో ఆయన జలవనరుల విభాగం ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌తో పాటు సుప్రీంకోర్టు (supreme court) న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, సీనియర్ న్యాయవాది రవీందర్‌రావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కృష్ణా బేసిన్, దాని వెంట నివసిస్తున్న జనాభా, కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు వంటి అంశాలను ప్రామాణికంగా చేసుకొని కృష్ణా జలాల్లో సగం వాటాను సాధించుకోవడానికి అవసరమైన పోరాటం చేయాలని సూచించారు.
నీటి వాటాలను ట్రైబ్యునల్ తేల్చేదాకా గత పదేళ్లుగా అనుసరిస్తున్న తాత్కాలిక నీటి పంపకాలకు అంగీకరించబోమని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రైబ్యునల్ 811 టీఎంసీలు కేటాయించిందని, అందులో 50 శాతం వాటాను కచ్చితంగా సాధించుకోవాలని చెప్పారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను (Srisailam project) ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా బోర్డుకు అప్పగించరాదని అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. తెలంగాణకు నదీ జలాల్లో సమాన వాటా దక్కించుకోవడానికి సుప్రీంకోర్టుతో పాటు ట్రైబ్యునల్‌లో రాజీలేని పోరాటం చేయాలని స్పష్టం చేశారు.
బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పు ప్రస్తుతం అమలు కావడం లేదని, దీనిపై సుప్రీంకోర్టులో కేసు (case) ఉందని, మహారాష్ట్ర, కర్ణాటకలు పరస్పర అంగీకారంతో ఈ వివాదాన్ని పరిష్కరించుకునేలా చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ మంత్రిని కోరారు. అంగీకరించిన మంత్రి, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఈఎన్‌సీ బి.నాగేంద్రరావు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ ఓరుగంటి మోహన్‌కుమార్, ఎస్‌ఈ విజయ్‌కుమార్, డీఈఈ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.