— మెస్, కాస్మెటిక్ చార్జీలు విడుదల చేయలేని ప్రభుత్వం
–ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు
Secretary Talla Nagaraju : ప్రజాదీవెన నల్గొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సంక్షేమరంగం గాడి తప్పిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు విమర్శించారు.శుక్రవారం ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్ వసతి గృహ లో ఉండే విద్యార్థుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని అన్నారు. రాష్ట్రంలో గిరిజన హాస్టల్ విద్యార్థులకు, గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులకు గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు మెస్, కాస్మోటికి చార్జీలు విడుదల చేయకుండా గిరిజన వసతి గృహాలలో విద్యార్థులు కడుపునిండా మూడు పూటల భోజనం ఏవిధంగా చేస్తారో రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు వానోస్తే వల వల, గాలి వస్తే గల గల అన్న రీతిలో విద్యార్థులు మగ్గుతున్నారని, తక్షణమే సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో చదువుకునే విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు లేక అద్దె భవనాలలో చాలీచాలని ఇరుకు గదులలో విద్యార్థులు కాలం వెలదీస్తున్నారన్నారు. ఒకపక్క అద్దె భవనాలలో నడుస్తున్న గురుకులాలకు కిరాయిలు చెల్లించలేదని ఇంటి యజమానులు విద్యార్థులను బయటకు వెళ్లగొట్టి తాళాలు వేస్తున్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించిందని అన్నారు.
గురుకులంలో చదువుతున్న విద్యార్థులకు సరిపడా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బట్టలు దుప్పట్లు ఇప్పటికీ రానటువంటి పరిస్థితి ఉందని, రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్లో, గురుకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టల్ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపునివ్వడం జరుగుతుందని హెచ్చరించారు. గురుకులాలకు సంతభవనాలు కట్టించకుండా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటూ అబద్ధపు మాటలతో విద్యార్థులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి త్వరలోనే మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు బతికి బట్ట కట్టలేదన్న చరిత్రను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోవద్దు అన్నారు. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయా రంగాలకు సంబంధించిన వసతి గృహాల అధికారులతో మంత్రులు తక్షణమే సమీక్ష జరిపించి రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్ లో వసతిగృహాలు గురుకులాలకు అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి వసతి గృహ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగం విద్యార్ధుల సమస్యలను పట్టించుకోకపోతే విద్యార్థులందరిని కూడగట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై బలమైన సమరశీల విద్యార్థి ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు.
ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, కుర్ర సైదా నాయక్, కోరే రమేష్, కుంచం కావ్య, స్పందన, రవిందర్, బుడిగ వేంకటేష్, మారుపాక కిరణ్, ఎం.ఏ .సైఫ్, జగన్, జగదీష్, ఇద్ది రాములు రాకేష్ ,ప్రణీత్, తదితరులు పాల్గొన్నారు.