Tuesday, September 29, 2026
More
    HomePoliticsDistrict Collector Ila Tripathi : కుక్కలకు నూరు శాతం వ్యాక్సిన్ వేయించాలి 

    District Collector Ila Tripathi : కుక్కలకు నూరు శాతం వ్యాక్సిన్ వేయించాలి 

    📰 Generate e-Paper Clip

    –అన్ని మున్సిపాలిటీలలో ఉన్న కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించాలి

    –ప్రతి మున్సిపాలిటీలో హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేయాలని

    –కుక్క కరిస్తే వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలి

    –జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

    District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : ప్రజలు కుక్కకాటు బారిన పడకుండా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో కుక్కలకు నూటికి నూరు శాతం వ్యాక్సిన్ వేయించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె తన చాంబర్లో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారితో ప్రజల పై కుక్కల దాడులు, కుక్క కాట్ల పై సమీక్ష నిర్వహించారు. అన్ని మున్సిపాలిటీలలో ఉన్న కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించాలని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం నల్గొండ మున్సిపాలిటీలో మాత్రమే ఎనిమల్ బర్త్ కంట్రోల్ విభాగం ఉందని, ఇతర మున్సిపాలిటీలలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. ప్రజలు కుక్కకాటుకు గురైన సందర్భంలో సంప్రదించేందుకుగాను అన్ని మున్సిపాలిటీలలో ప్రత్యేకంగా కుక్క కాటు కోసం హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేయాలని అన్నారు.గ్రామీణ ప్రాంతంలో ప్రజలు కుక్కకాటు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కుక్క కరిచిన తర్వాత తీసుకోవాల్సిన వ్యాక్సిన్, రేబిస్ వ్యాధి సోకితే దానిపరిణామాలపై అందరికీ అర్థమయ్యే విధంగా పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రేబిస్ వ్యాధి సోకిన వ్యక్తులు ఎలా ఉంటారో స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేయాలన్నారు.

     

    దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో రానున్న వారం, పది రోజుల్లో జంతు ప్రేమికులు కుక్కలను దత్తత తీసుకునే డ్రైవ్ ను ప్రారంభించాలని, అలాగే కుక్కలకు వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని, అనంతరం ఇతర మున్సిపాలిటీలలో సైతం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని తెలిపారు. కుక్కలను పెంచుకునే యజమానులు తప్పనిసరిగా కుక్కలకు వ్యాక్సిన్ వేయించడంతోపాటు, ఇంట్లో ఉన్న అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని కలెక్టర్ కోరారు. జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో కుక్కకాటుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, అంతేకాకుండా ఇమ్యునో గ్లోబలిన్ సైతం అందుబాటులో ఉందని, ఎవరికైనా కుక్క కరిస్తే వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. కుక్కలకు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత నమోదు చేసుకోవడమే కాకుండా తిరిగి ఎప్పుడు వ్యాక్సిన్ ఇవ్వాలో ఒక కార్డును జారీ చేయాలని అన్నారు. మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో కుక్క కాటు బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్తను వేయవద్దని, ముఖ్యంగా మిగిలిపోయిన ఆహార పదార్థాలను రోడ్లపై వేయడం వల్ల వాటిని తినేందుకు వచ్చిన కుక్కలు మనుషులను కరుస్తున్నాయని, అందువల్ల రోడ్లపై మిగిలిపోయిన ఆరపదార్థాలు వేయవద్దని కోరారు. కుక్కలు కరుస్తున్నాయని ఎవరు కుక్కలకు ప్రమాదాన్ని తీసుకురాకూడదని, ఎట్టి పరిస్థితులలో కుక్కలను చంపవద్దని ఆమె స్పష్టం చేశారు. మున్సిపల్ ప్రాంతాలలో చెత్త ఉండే ప్రదేశాలను గుర్తించి తక్షణమే చెత్తను తొలగించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సైతం చెత్త కుప్పలు తొలగించాలని, ఇకపై గ్రామీణ ప్రాంతం నుండి ఒక్క కుక్క కాటు కేసు కూడా రాకూడదని అన్నారు. చాలామంది కుక్కల యజమానులు ఉదయం సాయంత్రం సమయాలలో కుక్కలను బయటికి వదలడం జరుగుతున్నదని, ఆ సమయంలోనే అవి ప్రజలను కరిచేందుకు ఆస్కారం ఉందని, అలా కుక్కలను బయటకు వదిలే వారిని గుర్తించి జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

     

    అన్ని మున్సిపల్ ప్రాంతాలలో కుక్కల ప్రేమికులు, పెట్ లవర్స్ క్లబ్ ల ను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు, నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి తో సహా కుక్కకాటుకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, కుక్క కరిచిన వారు తప్పనిసరిగా కుక్కకాటు తీవ్రతను బట్టి వ్యాక్సిన్ డోసులు తీసుకోవాలని, కుక్కలు పెంచుకునే వారు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని, కుక్కలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు. కుక్కకాటుకు కట్టుకట్టవద్దని, కులాయి కింద గాయాన్ని ఉంచి శుభ్రంగా కడగాలని తెలిపారు. కుక్కకాటు తీవ్రతను బట్టి వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.

    జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి మాట్లాడుతూ పెంచుకున్న కుక్కలకు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని అన్నారు. మిర్యాలగూడలో ఏనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జిల్లా కలెక్టర్ కు తెలుపగా, మిర్యాలగూడలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ అంగీకరించారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, డిప్యూటీ డిఎంహెచ్వోలు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ రవి, జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు, ఈ సమావేశానికి హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.