Sunday, September 27, 2026
More
    HomeIndiaBharathiraja Passes Away: సినీ లోకాన్ని విషాదంలో ముంచిన భారతీరాజా మృతి

    Bharathiraja Passes Away: సినీ లోకాన్ని విషాదంలో ముంచిన భారతీరాజా మృతి

    📰 Generate e-Paper Clip

    Bharathiraja Passes Away: భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ జీవితాన్ని అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించిన ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా (Bharathi Raja) ఇక లేరు. 84 ఏళ్ల వయసులో ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో (Health Problems) బాధపడుతున్న ఆయన పరిస్థితి ఇటీవల మరింత విషమించడంతో కన్నుమూశారు.

    ఆయన మరణ వార్త సినీ అభిమానులను, చిత్ర పరిశ్రమ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళ సినిమాకు కొత్త దిశను చూపిన దర్శకుడిగా గుర్తింపు పొందిన భారతీరాజా, తన చిత్రాల ద్వారా గ్రామీణ సంస్కృతి, మానవ సంబంధాలు, సామాజిక సమస్యలను ప్రేక్షకులకు చేరువ చేశారు.

    1941 జూలై 17న తమిళనాడులోని (Tamilnadu) అల్లినగరం గ్రామంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నసామి. 1977లో విడుదలైన ’16 వయతినిలే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆ చిత్రం తమిళ సినిమాకు (Tamil Movie) కొత్త శకానికి నాంది పలికింది. శ్రీదేవి, రజినీకాంత్ వంటి నటుల కెరీర్‌లకు కూడా ఆ సినిమా బలమైన పునాది వేసింది.

    దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన సుమారు 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘కిళక్కే పోగుమ్ రైల్’, ‘సిగప్పు రోజాక్కళ్’, ‘ముదల్ మరియాదై’, ‘వేదం పుదిదు’ వంటి చిత్రాలు ఆయన ప్రతిభకు నిదర్శనాలుగా నిలిచాయి. గ్రామీణ జీవితం మాత్రమే కాకుండా కుల వివక్ష, సామాజిక అసమానతలు, మానవ విలువలను కూడా తన చిత్రాల్లో హృదయానికి హత్తుకునేలా చూపించారు.

    Veteran filmmaker Bharathiraja, known for revolutionizing rural storytelling in Indian cinema, passed away after a prolonged illness.

    తెలుగు ప్రేక్షకులతోనూ భారతీరాజాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన తెరకెక్కించిన ‘సీతాకోకచిలుక’, ‘ఆరాధన’, ‘జమదగ్ని’ చిత్రాలు మంచి గుర్తింపు పొందాయి. ‘సీతాకోకచిలుక’ చిత్రానికి జాతీయ పురస్కారం దక్కగా, ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును కూడా ఆయన అందుకున్నారు. ‘మంగమ్మగారి మనవడు’ చిత్రానికి కథ అందించడంతో పాటు ‘పల్నాటి పౌరుషం’ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు.

    దర్శకుడిగానే కాకుండా నటుడిగా, నిర్మాతగా కూడా భారతీరాజా తన ముద్ర వేశారు. కార్తీక్, రేవతి వంటి అనేక మంది నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేసి వారి ఎదుగుదలకు కారణమయ్యారు.

    గత ఏడాది తన కుమారుడు, నటుడు మనోజ్ (Actor Manoj) భారతీరాజా ఆకస్మిక మరణం ఆయనను తీవ్రంగా కలచివేసింది. ఆ విషాదం తర్వాత ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. మానసిక ఒత్తిడి, శ్వాసకోశ సమస్యలతో పలుమార్లు ఆసుపత్రిలో చికిత్స పొందారు. చివరకు అనారోగ్యంతో కన్నుమూశారు.

    భారతీయ సినిమాకు చేసిన విశిష్ట సేవలకు గాను ఆయనకు ఆరు జాతీయ చలనచిత్ర పురస్కారాలు లభించాయి. 2004లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అభిమానులు ప్రేమగా ‘మిరాకిల్ డైరెక్టర్’గా పిలుచుకునే భారతీరాజా మరణంతో భారతీయ సినీ రంగం ఓ గొప్ప సృజనాత్మక శక్తిని కోల్పోయింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.